న్యూఢిల్లీ : ఆన్లైన్ వేదికగా ఫ్రెండ్స్‌ను కనెక్ట్ చేసే సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలో ఫేస్బుక్ ముందువరసలో నిలుస్తుంది. అయితే ఈ వేదికపై మీరు ఎవరిని ఫ్రెండ్స్‌గా ఎంచుకుంటున్నారనే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. కేరళకు చెందిన ఓ మహిళ తన ఫేస్బుక్ ఫ్రెండ్ చేతిలో (Cyber Fraud) ఏకంగా రూ. 8 లక్షలకు మోసపోయారు. కాసర్ఘఢ్లోని ఓ స్వీట్ షాపులో పనిచేసే మహిళను ఫేస్బుక్ ఫ్రెండ్ అడ్డంగా మోసగించాడు. బ్రిటన్‌కు చెందిన వ్యక్తిగా పరిచయం చేసుకున్న నిందితుడి ఫేస్బుక్ ఫ్రెండ్ రిక్వెస్ట్‌ను మహిళ యాక్సెప్ట్ చేసింది.
ఆ వ్యక్తి తనను డాక్టర్ కెనెడీ నిక్ మూర్స్గా చెప్పుకున్నాడు. తాను ఆమెకు ఖరీదైన బహుమతి పంపాలనుకుంటున్నానని నమ్మబలికాడు. కొద్దివారాలు చాటింగ్ చేసిన అనంతరం గిఫ్ట్ పంపేందుకు ఆమె అడ్రస్ చెప్పాలని నిందితుడు కోరాడు. ఆమె తన అడ్రస్‌ను ఇవ్వగా కొద్దిరోజుల తర్వాత పర్ఫెక్ట్ కార్గో అనే కొరియర్ కంపెనీ నుంచి ఆమెకు కాల్ వచ్చింది. బహుమతిని అందుకునేందుకు మహిళ రూ. 25,400 చెల్లించాలని వారు కోరారు. కంపెనీ పేరును ఆమె గూగుల్‌లో చెక్ చేసుకుని సంతృప్తి చెందిన అనంతరం ఆ మొత్తం చెల్లించింది.
ఆపై మరోసారి ఫోన్ చేసిన కొరియర్ కంపెనీ వ్యక్తి ప్రస్తుతం ఆ ప్యాకేజ్ ఐటీ అధికారుల వద్ద ఉందని, అందులో పెద్దమొత్తం నగదు ఉందని ఆ సొమ్మును విడిపించుకునేందుకు కోర్ట్ ఉత్తర్వులు కావాలని అందుకు రూ. 80,000 చెల్లించాలని కోరాడు. ఐటీ నుంచి ఎన్ఓసీ కోసం మరో రూ 2.17 లక్షలు చెల్లించాలని నమ్మబలికారు. బాధితురాలి వద్ద అంత నగదు లేకపోవడంతో బంధువుల నుంచి అప్పు తీసుకుని మరీ వారికి చెల్లించింది.
ఇక మరోసారి ఫోన్ చేసిన వ్యక్తి అంత పెద్ద మొత్తంలో అక్రమ డబ్బును విడిపించుకునేందుకు మరికొంత నగదు పంపాలని తాము చివరిసారిగా ఫోన్ చేస్తున్నామని రూ. 4 లక్షలు చెల్లించాలని మభ్యపెట్టారు. నిందితులను నమ్మిన మహిళ మరికొంత అప్పు చేసి వారు కోరిన మొత్తాన్ని పంపారు. తనకు రావాల్సిన డబ్బు గురించి కొరియర్ కంపెనీ వ్యక్తికి మహిళ ఫోన్ చేయగా మరోసారి రూ. 67,000 పంపాలని కోరడంతో మోసపోయానని గుర్తించి పోలీసులను ఆశ్రయించింది.
Read More :
PhonePe: కాంగ్రెస్ పార్టీకి వార్నింగ్ ఇచ్చిన ఫోన్ పే