కోయంబత్తూర్ : తమిళనాడులోని కోయంబత్తూర్లో దారుణం జరిగింది. అభ్యంతరకర వీడియోలు చూస్తూ కంటబడిన బాలికను ఆమె బంధువు బెదిరించి పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన చేరన్మ నగర్లో కలకలం రేపింది. బాధిత బాలిక తల్లితండ్రులు ఫిర్యాదు చేయడంతో ఈ ఉదంతం వెలుగుచూసింది. నిందితుడిని వదమధురైకి చెందిన ఆర్ మూర్తిగా గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రెండు నెలల కిందట పదో తరగతి చదువుతున్న బాలిక (17) అభ్యంతరకర వీడియోలను చూస్తుండటం నిందితుడు (33) గమనించి ఆమెను బెదిరించాడు. తాను చెప్పినట్టు వినకుంటే ఫోన్లో అశ్లీల వీడియోలు చూస్తున్నావని మీ తల్లితండ్రులకు చెబుతానని లోబరుచుకున్నాడు. అప్పటినుంచి బాలికను పలుమార్లు లైంగిక వేధింపులకు గురిచేశాడు.
ఈ విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని బాలికను హెచ్చరించాడు. ఈ క్రమంలో ఇటీవల బాలిక ఇంటికి వచ్చిన నిందితుడు ఆమె సోదరుడిని క్రికెట్ బాల్ తీసుకురమ్మని బయటకు పంపి బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. నిందితుడి తీరుతో విసిగిన బాలిక ధైర్యం తెచ్చుకుని విషయం తల్లితండ్రులకు తెలిపింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.