షాద్‌నగర్ : విద్యాబుద్దులు నేర్చుకోవాల్సిన ఓ బాలిక దొంగతనలకు పాల్పడుతున్న ఘటన మరోమారు షాద్‌నగర్‌లో శనివారం ఉదయం వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం.. షాద్‌నగర్ పట్టణంలోని దేవిశ్రీ వస్త్ర దుకాణంలో వస్త్రాలను కొనుగోలు చేసేందుకు పట్టణానికి చెందిన విజయ అనే మహిళ వచ్చింది. ఈ నేపథ్యంలోనే వస్త్రాలను పరిశీలిస్తుండగా గుర్తు తెలియని ఓ 14 సంవత్సరాల బాలిక దుకాణంలోకి ప్రవేశించి చాకచక్యంగా విజయ తెచ్చుకున్న సంచిలో నుంచి పర్స్‌ను దొంగిలించింది. తేరుకున్న బాధిత మహిళ పర్స్ చోరికి గురైందని భావించి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పర్సులో రూ. 6వేల నగదు, వెండి వస్తువులు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొంది. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు దుకాణంలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. జరిగిన ఘటనపై షాద్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. చోరి జరిగిన సంఘటన స్థలాన్ని ఏసీపీ కులష్కర్ పరిశీలించారు.