ముంబై : అర్ధరాత్రి తర్వాత మద్యం, ఫుడ్ సరఫరా చేయలేదని హోటల్ క్యాషియర్‌ను హింసించిన అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు స్పందించారు. మహారాష్ట్రలోని శాంతాక్రజ్‌లో వకోలా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనపై విచారణకు అధికారులు ఆదేశించారు. తనకు మద్యం, ఆహారం ఇవ్వలేదని హోటల్ క్యాషియర్‌పై పోలీస్ అధికారి దాడికి పాల్పడటం ఈ వీడియోలో కనిపించింది.
వకోలా పోలీస్ స్టేషన్ పరిధిలోని స్వాగత్ రెస్టారెంట్లో గురువారం రాత్రి 12.30 గంటలకు ఈ ఘటన జరిగింది. విక్రం పాటిల్ అనే అధికారి క్యాషియర్ చొక్కాపట్టుకుని లాగి చెంపదెబ్బ కొడుతున్న దృశ్యాలు ఈ వీడియోలో కనిపించాయి. హోటల్లోని సీసీటీవీ కెమెరాలో విక్రం పాటిల్ ఆగడాలు రికార్డయ్యాయి.
రెస్టారెంట్ కిచెన్ క్లోజ్ చేయడంతో ఉచితంగా ఆహారాన్ని అందించలేమని క్యాషియర్ చెబుతున్నా వినిపించుకోకుండా అకారణంగా పోలీస్ అధికారి దాడి చేశాడని అసోసియేషన్ ఆఫ్ హోటల్ అండ్ రెస్టారెంట్ ప్రెసిడెంట్ శివానంద్ షెట్టి ఈ ఘటన గురించి వివరించారు. విక్రం కుమార్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.