తిరువనంతపురం : బాలికలపై నేరాలను నిరోధించేందుకు కోయంబత్తూరు పోలీసులు పోలీస్ అక్కలను నియమించారు. ఈ టాస్క్ కోసం తాము 37 మంది మహిళా పోలీస్ అధికారులను ఎంపిక చేశామని కోయంబత్తూర్ పోలీసులు వెల్లడించారు. ఈ ప్రాజెక్టును కోయంబత్తూర్ సిటీ పోలీస్ కమిషనర్ వి.బాలకృష్ణన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో 61 కాలేజీలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.
ఆయా కాలేజీలకు కేటాయించిన పోలీస్ అధికారిణులు విద్యార్ధులతో కమ్యూనికేషన్ ఏర్పరచుకుని నిరంతరం అవసరమైన సాయం అందిస్తారని కమిషనర్ పేర్కొన్నారు. సైబర్ నేరాలకు పలువురు విద్యార్ధులు బాధితులవుతుండగా పది మందిలో కేవలం ఒకరే సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారని అన్నారు. మరికొందరు ఇలాంటి విషయాలను తల్లితండ్రులతో పంచుకోలేక మానసిక క్షోభ అనుభవిస్తున్నారని అలాంటి సమస్యలకు ఈ కార్యక్రమం పరిష్కారంగా ముందుకొస్తుందని ఆయన వివరించారు.
పోలీస్ అధికారులు, విద్యార్ధుల మధ్య జరిగే సంప్రదింపులను గోప్యంగా ఉంచేలా చర్యలు చేపడతామని చెప్పారు. పోకిరీల వేధింపుల నుంచి కూడా మహిళా పోలీస్ అధికారులు విద్యార్ధినులకు రక్షణ కల్పిస్తారని తెలిపారు. ఆకతాయిల వేధింపులతో విద్యార్ధినులు తీవ్ర నిర్ణయాలు తీసుకోకుండా తాము చేపట్టే కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాలేజ్ క్యాంపస్‌ల్లో పోలీస్ అక్కల ఫోన్ నెంబర్లను ప్రముఖంగా ప్రదర్శిస్తారని, క్యాంపస్‌లో వారానికి ఓ సారి పోలీసులు విద్యార్ధినులను కలుస్తారని తెలిపారు. కాగా, యువతులు, మహిళలను పోకిరీల వేధింపుల నుంచి కాపాడి వారిలో భరోసా నింపేందుకు తెలంగాణ ప్రభుత్వం గతంలోనే షీ టీమ్స్ ఏర్పాటు చేసి సత్ఫలితాలు సాధించింది.