Killed and Scatted | దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటు చేసుకున్నది. తనతో సహజీవనం చేస్తున్న యువతిని దారుణంగా చంపిన ఓ వ్యక్తి.. అనంతరం ఆమెను ముక్కలుగా కోసి ఢిల్లీ అంతటా విసిరేసాడు. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితుడిని అఫ్తాబ్ అమీన్ పూనావాలాగా పోలీసులు గుర్తించారు. ఐదు నెలల క్రితం ఈ ఘటన జరగ్గా.. చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అఫ్తాబ్ అమీన్ 26 ఏళ్ల శ్రద్ధ గత కొన్నాళ్లుగా సహజీవనం చేస్తున్నారు. తనను పెండ్లి చేసుకోవాలని అఫ్తాబ్‌పై శ్రద్ధ ఒత్తిడి చేస్తూ వస్తున్నది. ఈ విషయమై ఇద్దరూ తరచుగా గొడవ పడుతుండేవారు. మే 18న మరోసారి జరిగిన వాగ్వాదం తీవ్రస్థాయికి చేరుకున్నది. ఈ నేపథ్యంలో అఫ్తాబ్ తన భాగస్వామి శ్రద్ధను గొంతు కోసి చంపాడు. అనంతరం పదునైన ఆయుధంతో ఆమె శరీరాన్ని ముక్కలు చేశాడు. చాలా రోజుల పాటు ఢిల్లీలోని వివిధ ప్రదేశాల్లో తిరుగుతూ ఆమె శరీరం ముక్కలను పారవేశాడు.
బాధితురాలి తండ్రి వికాస్ మదన్ నవంబర్ 8న ఢిల్లీలోని మెహ్రౌలీ పోలీస్ స్టేషన్లో తన కుమార్తె కిడ్నాప్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ముంబైలోని ఓ కాల్ సెంటర్లో పనిచేసిన సమయంలో అక్కడ ఆమెకు అఫ్తాబ్‌తో స్నేహం ఏర్పడిందని తండ్రి తన ఫిర్యాదులో తెలిపారు. ఆమె కుటుంబీకులు తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ చివరికి అఫ్తాబ్‌తో ఢిల్లీ వెళ్లి సహజీవనం చేసింది. ఢిల్లీలోని ఛతర్పూర్ ప్రాంతంలో ఓ ఫ్లాట్ అద్దెకు తీసుకుని నివసిస్తున్నారు. 2022 మే నెల తర్వాత నుంచి తమ కుమార్తె నుంచి తమకు ఎలాంటి సమాచారం అందలేదని, తమను ఆమె సంప్రదించలేదని తండ్రి వికాస్ చెప్పాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని అఫ్తాబ్ అమీన్ పూనావాలాను విచారిస్తున్నారు.