న్యూయార్క్ : కూతురి భవిష్యత్‌ను పణంగా పెట్టిన అమెరికన్ ఆంటీ మాస్టర్ స్కెచ్ వేసి అడ్డంగా బుక్ అయింది . లౌరా అనే 48 ఏండ్ల మహిళ తన 22 ఏండ్ల కూతురు లౌరెన్ పేరుతో యూనివర్సిటీలో జాయిన్ కావడంతో పాటు రుణాలు తీసుకుని బురిడీ కొట్టించింది. లౌరా యువతిగా బిల్డప్ ఇస్తూ తోటి విద్యార్ధులతో డేటింగ్‌లకూ తెగబడి ఔరా అనిపించింది. రెండేండ్ల పాటు ఈ నాటకాన్ని రక్తి కట్టించింది.
అర్కన్సాస్‌లో కూతురితో కలిసి ఉండే లౌరా 2016లో మిసోరికి మకాం మార్చింది. కూతురు లౌరెన్ పేరుతో డ్రైవింగ్ లైసెన్స్ సంపాదించి ఆపై కూతురి పేరుతోనే సౌత్‌వెస్ట్ బాప్టిస్ట్ యూనివర్సిటీలో అడ్మిషన్ పొందింది. ఆపై ఫెడరల్ స్టూడెంట్స్ లోన్స్ ఆఫర్ కింద రూ 7.12 లక్షల రుణం పొందింది. ఆమె 22 ఏండ్ల యువతిలానే కనిపిస్తుండటంతో బాయ్‌ఫ్రెండ్స్‌తో డేట్‌కు వెళుతుండేది.
అయితే లౌరా తన వాస్తవ వయసు కంటే 26 ఏండ్లు చిన్నగా కనిపిస్తుందని స్ధానికులు చెపుతుంటారని మౌంటెన్ వ్యూ పోలీస్ చీఫ్ జేమీ పెర్కిన్స్ తెలిపారు. కూతురి పేరుతో లౌరా ఆడుతున్న నాటకానికి 2018లో తెరపడింది. కూతురు పేరుతో చెలామణి అవుతున్న లౌరా ఆచూకీ కోసం అర్కాన్సాస్ పోలీసులు మిసోరి పోలీసులను సంప్రదించడంతో ఆంటీ యవ్వారం బయటపడింది. ఈ ఆరోపణలను మొదట తోసిపుచ్చిన లౌరా ఆధారాలు బయటపెట్టడంతో నేరాన్ని అంగీకరించింది.
ఆమె గత కొన్నేండ్లుగా భర్తతో విభేదాలతో ఇల్లు విడిచి తిరుగుతోందని, రెండేండ్ల పాటు కూతురి పేరుతో చలామణి అయి పలు నేరాలకు పాల్పడటమే కాకుండా కూతురు జీవితాన్నీ నాశనం చేసిందని పోలీస్ అధికారి పెర్కిన్స్ పేర్కొన్నారు. యూనివర్సిటీలో క్లాసులకు లౌరా హాజరైందా లేదా అనేది తెలియదని చెప్పారు. లౌరాకు ఈ నేరంపై ఐదేండ్ల జైలు శిక్ష పడవచ్చని చెబుతున్నారు.