Cyber Fraud : దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు విచ్చలవిడిగా పెరుగుతున్నాయి. రోజుకో తరహా స్కామ్‌తో సైబర్ నేరగాళ్లు చెలరేగుతున్నారు. నాగపూర్‌కు చెందిన వ్యాపారవేత్త ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ స్కామ్‌లో ఇటీవల ఏకంగా రూ. 87 లక్షలు పోగొట్టుకున్నారు. వ్యాపారవేత్త మనీష్ మిశ్రా (41)కు ఫేస్బుక్లో పరిచయమైన జస్లీన్ ప్రసాద్ మాయమాటలతో దగ్గరయ్యాడు. న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్వైఎస్ఈ)లో న్యూయార్క్స్టాక్ఎక్స్ఛేంజ్.టాప్.టూ అనే వెబ్సైట్ ద్వారా పెట్టుబడులు పెడుతూ భారీ రిటన్స్ పొందవచ్చని మభ్యపెట్టాడు.
\మిశ్రా నమ్మకం చూరగొనేందుకు మెరుగైన రిటన్స్ పొందిన ఇన్వెస్టర్ల స్క్రీన్‌షాట్స్‌ను ప్రసాద్ షేర్ చేశాడు.దీంతో మిశ్రా నమ్మకాన్ని స్కామర్ చూరగొన్నారు. తొలుత కొద్దిమొత్తం పెట్టుబడితో ట్రేడింగ్ ప్రారంభించారు. ఆపై కొద్ది నిమిషాలకే ట్రేడింగ్ ప్లాట్‌ఫాంలో తన పెట్టుబడి రూ. 50000 ఏకంగా రూ. 1.42 లక్షలకు పెరగడమే కాకుండా ఆ మొత్తం మిశ్రా బ్యాంక్ ఖాతాలో రిఫ్లెక్ట్ అయింది. దీంతో ట్రేడింగ్ ప్లాట్‌ఫాంపై మిశ్రాకు మరింత నమ్మకం కలిగింది. ఆపై ఇదే ప్లాట్‌ఫాంపై రూ, 30 లక్షలు ఇన్వెస్ట్ చేసే పదింతల లాభం వస్తుందని స్కామర్ మిశ్రాను ప్రలోభపెట్టాడు.
జస్లీన్ ప్రసాద్ సూచించిన మేరకు రూ. 30 లక్షలు ఇన్వెస్ట్ చేసిన మిశ్రా కేవలం పది నిమిషాల్లోనే తాను పెట్టుబడి పెట్టిన మొత్తం కోల్పోయారు. కంగారు పడిన మిశ్రా ప్రసాద్‌ను సంప్రదించగా తాము సూచించిన సలహాలను అనుసరించనందుకే నష్టాలు వచ్చాయని నమ్మబలికాడు. తాను చెప్పినట్టు చేస్తే పదిరెట్లు లాభాలు వస్తాయని చెబుతూ బాధితుడిచే మరో రూ. 57 లక్షలు ఇన్వెస్ట్ చేయించాడు. ఆపై ట్రేడింగ్ స్క్రీన్‌పై మిశ్రా పేరుతో రూ. 8 కోట్ల లాభం చూపారు.
ఈ మొత్తం తన బ్యాంక్ ఖాతాకు మళ్లించాలని కోరగా ఈ లావాదేవీని ప్రాసెస్ చేసేందుకు సెక్యూరిటీ కోడ్ అవసరమని, దీనికోసం అదనంగా రూ. 82 లక్షలు చెల్లించాలని కోరారు. దీంతో మోసపోయానని గ్రహించిన మిశ్రా సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి దర్యాప్తు ముమ్మరం చేశారు.
Read More :
Chandra Sekhar Pemmasani: మోదీ సర్కారులో అత్యంత సంపన్న మంత్రి ఎవరో తెలుసా?