Crime news : గుజరాత్ (Gujarat) లో దారుణం జరిగింది. ప్రియుడితో ఏకాంతంగా గడుపుతుండగా చూశాడని కట్టుకున్న భర్తనే దారుణంగా హత్య చేసింది. ప్రియుడి సహాయంతో దారుణంగా హతమార్చింది. మొదట సహజ మరణంగా అందరినీ నమ్మించినా.. పోలీసుల దర్యాప్తులో అసలు నిజం బయటపడింది. పోలీసుల వెల్లడించిన కథనం ప్రకారం.. వావ్-థరాడ్ జిల్లా (Wav-Tharad district) గణేష్‌పుర (Ganeshpura) గ్రామానికి చెందిన గమాభాయ్ ఠాకూర్ (Gamabhai Takur) అనే వ్యవసాయ కూలీ జూలై 8న రాత్రి తన ఇంట్లో శవమై కనిపించాడు. మొదట సాధారణ మరణంగా భావించినా పోలీసులకు అనుమానం రావడంతో కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.
పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఘటన జరిగిన రోజు రాత్రి గమాభాయ్ ఇంటికి వచ్చేసరికి తన భార్య నర్మద ఆమె ప్రియుడు ప్రేమ్‌జీ పటేల్‌తో ఏకాంతంగా ఉండటాన్ని చూశాడు. ఈ విషయమై వారి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో నర్మద చెక్క పలకతో గమాభాయ్ తలపై కొట్టడంతో అతను కిందపడిపోయాడు. ఆ తర్వాత నర్మద, ఆమె ప్రియుడు ప్రేమ్‌జీ, మరో సహచరుడు ముఖేశ్ ఠాకూర్ తాడుతో గమాభాయ్ గొంతు నులిమి హత్య చేశారు. మరుసటి రోజు ఉదయం గమాభాయ్ గుండెపోటుతో మరణించాడని నిందితులు అందరినీ నమ్మించారు.
అయితే గమాభాయ్ ఊపిరాడకపోవడం వల్ల మరణించాడని పోస్ట్‌మార్టమ్ నివేదికలో తేలింది. దాంతో అతడిది హత్య అని నిర్ధారణ అయింది. పోలీసులు నిందితురాలు నర్మదతోపాటు ఆమె ప్రియుడు ప్రేమ్‌జీ పటేల్, ముఖేష్ ఠాకూర్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించారు. కాగా గమాభాయ్, నర్మద దంపతులకు తొమ్మిది మంది పిల్లలు ఉన్నారు. ఇప్పుడు తండ్రి హత్యకు గురికావడం, తల్లి జైలుకు వెళ్లడంతో ఆ చిన్నారులంతా అనాథలుగా మారారు.