వెంగళరావునగర్ : దీపావళి పండగ నాడు అందరి ఇండ్లు బంధువులతో కళకళలాడుతున్నాయి..పెళ్ళి చేసుకుని వేరే ప్రాంతంలో స్థిర పడ్డ కుమారుడు, కోడలు కూడా ఇంటికి వస్తారని గంపెడాశతో ఆ తల్లి ఎదురు చూసింది. కన్న కొడుకు ఉద్యోగ రిత్య వేరే ప్రాంతంలో ఉండడంతో రాలేక పోయాడు. దాంతో ఆ తల్లి హృదయం ఆవేదనతో బరువెక్కింది.
మనస్తాపంతో ఆ కన్న తల్లి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్.ఆర్.నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన వివరాలు ఎస్సై శంకర్ కథనం మేరకు ఇలా ఉన్నాయి..మోడల్‌కాలనీకి చెందిన దండ బుచ్చిబాబు, సుజాత (53) ల కుమారుడు దండ యోగతో గుంటూరుకు చెందిన రాహిత్యశ్రీ కి ఈ సంవత్సరం ఆగస్టులో వివాహం జరిగింది.
ఇటీవల కుమారుడు, కోడలు ఉద్యోగ రిత్య విశాఖపట్నం వెళ్లి స్థిరపడ్డారు. దీపావళికి ఇంటికి రావాలని సుజాత కొడుకుని కోరినప్పటికీ సెలవు లేకపోవడంతో వారు రాలేదు. దీంతో సుజాత మనస్థాపానికి గురయ్యింది. ఈ క్రమంలో గురువారం తెల్లవారు జామున భర్త బుచ్చిబాబు పెంట్‌హౌస్‌లో నిద్రపోయాడు.
భార్య సుజాత కింద అంతస్థుకు చేరుకుని గదిలోకి వెళ్లి సీలింగ్ ఫ్యాన్ రాడ్డుకు చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఉదయాన్నే భార్య ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని గుర్తించిన భర్త పోలీసులకు సమాచారం ఇన్వడంతో ఈ మేరకు కేసు నమోదు చేసకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.