మిర్యాలగూడ రూరల్/నల్లగొండ : అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురు సభ్యులను మిర్యాలగూడ రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద రూ.లక్షా 40 వేల విలువైన 14 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని మిర్యాలగూడ డీఎస్పీ వెంకటేశ్వర్ రావు తెలిపారు. ఈ మేరకు నిందితుల వివరాలను ఆయన సోమవారం మీడియాకు వెల్లడించారు. జిల్లా ఎస్పీ ఏ.వి. రంగనాధ్ ఆదేశాల మేరకు గంజాయి రవాణా, విక్రయాలపై పటిష్ట నిఘా పెట్టినట్లు డీఎస్పీ చెప్పారు.
నార్కట్ పల్లి – అద్దంకి హైవేలో మిర్యాలగూడ రూరల్ సర్కిల్ పరిధిలోని గూడూరు వద్ద వాహనాల తనిఖీలు చేపట్టామననారు. బైక్పై అనుమానాస్పదంగా వెళ్తున్న వ్యక్తులను తనిఖీ చేయాగా వారి వద్ద నుంచి 14 కిలోల గంజాయి లభించిందన్నారు. మూడు సెల్ ఫోన్లు, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన చల్లా రాహుల్ రెడ్డి, పోచమల్ల సురేష్, జాస్తి జీవన్ కుమార్ గంజాయి రవాణా చేస్తున్నట్లుగా ఒప్పుకున్నారని డీఎస్పీ చెప్పారు.
వీరు ముగ్గురు గంజాయిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం సమీపంలోని సారపాక ప్రాంతంలో ఓ వ్యక్తి నుంచి కొనుగోలు చేసి హైదరాబాద్ లో విక్రయించేందుకు వెళ్తున్నట్లుగా విచారణలో తెలిసిందన్నారు. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నామని వివరించారు.