బేగంపేట, ఏప్రిల్ 18: ఇంటి బయట ఆడుకుంటున్న బాలికతో ఓ మైనర్ బాలుడు అఘాయిత్యానికి ఒడిగట్టాడు. బాలికను ఇంట్లోకి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. హైదరాబాద్ బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్నానగర్ ప్రాంతానికి చెందిన తొమ్మిదేళ్ల బాలిక గురువారం సాయంత్రం ఇంటి బయట ఆడుకుంటుంది. అదే ప్రాంతంలో నివసించే బిహార్‌కు చెందిన బాలుడు (16) ఆమెకు చాక్లెట్ ఇస్తానని ఆశచూపి ఇంట్లోకి తీసుకెళ్లాడు. అనంతరం బాలిక చేతులు కట్టేసి అసభ్యంగా వ్యవహరించాడు. ఊహించని చర్యతో భయపడిపోయిన బాలిక కేకలు వేస్తూ ఇంట్లో నుంచి పారిపోయింది. తల్లిదండ్రులకు వెళ్లి జరిగిన విషయం చెప్పింది. ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఈ మేరకు పోక్సో కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలుడిని జువైనల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపరుస్తామని బేగంపేట ఇన్స్పెక్టర్ ప్రసాదరావు తెలిపారు.