చెన్నై : మాస్క్ ధరించిన వ్యక్తి తల్లీకూతుళ్లను దారుణంగా హత్య చేసి బంగారు ఆభరణాలను దోచుకుని పరారైన ఘటన తమిళనాడులోని విల్లుపురం జిల్లా కండప్పచవడి గ్రామంలో కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం తెల్లవారుజామున బాధితుల ఇంట్లోకి ప్రవేశించిన వ్యక్తి చోరీకి యత్నించాడు. నిద్రిస్తున్న మహిళ (80), ఆమె కూతురు (60) మేలుకోవడంతో వారిపై కట్టెతో దాడి చేశాడు.
తీవ్రగాయాలకు లోనై వారు మరణించగా బంగారు ఆభరణాలతో ఉడాయించాడు. ఉదయం ఎంతసేపటికీ తల్లీకూతుళ్లు ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన స్ధానికులు లోపలకి వెళ్లి చూడగా మహిళలు ఇద్దరూ విగతజీవులుగా పడిఉన్నారు. బాధిత మహిళలపై నిందితుడు లైంగిక వేధింపులకు పాల్పడేందుకు ప్రయత్నించడంతో వారు ప్రతిఘటించడంతో ఈ ఘాతుకానికి తెగబడ్డాడని అనుమానిస్తున్నామని విల్లుపురం ఎస్పీ ఎన్ శ్రీనాధ పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశామని తెలిపారు.