చెన్నై : పేదరికం ముందు పేగుబంధం తలవంచింది. పేదరికంలో మగ్గుతున్న ఓ జంట తమ నలుగురు పిల్లలను మేకల యజమానికి విక్రయించిన ఘటన తమిళనాడులో కలకలం రేపింది. రెండేండ్ల పాటు బాల్యాన్ని కోల్పోయిన పిల్లలను ఓ ఎన్జీవో కాపాడటంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితులను వెట్రివేల్ (9), వేలాయుధన్ (8), సుందర్ (6), శక్తివేల్ (7)గా గుర్తించారు.
మేకలు కాసేందుకు ఈ పిల్లలను యజమాని జీ గోవిందరాజన్ వారి తల్లితండ్రులు (సుందర్రాజన్, బాపతి) నుంచి రూ 62,000కు కొనుగోలు చేశాడు. తొలుత వీరు తమ బంధువుల పిల్లలని నమ్మబలికిన గోవిందరాజన్ ఆపై వీరిని తాను కొనుగోలు చేశానని అంగీకరించాడు. తాము మేకలను మేపేందుకు రోజూ పది కిలోమీటర్లు వాటిని మేతకు తీసుకువెళ్లేవారమని పిల్లలు చెప్పుకొచ్చారు.
మేకల యజమాని పిల్లలను మానసికంగా శారీరకంగా హింసించేవాడని మేకల మంద నుంచి ఓ మేక తప్పిపోవడంతో ఒకరోజు పిల్లలను చితకబాదాడని ఎన్జీవో ప్రతినిధి వెల్లడించారు. బాధితుల తల్లితండ్రులు కష్టాల్లో ఉన్నారని తెలుసుకున్న గోవిందరాజన్ వారి పిల్లలను తనకు విక్రయించాలని కోరాడు. వారికి కష్టమైన పనులు అప్పగించనని మభ్యపెట్టి ఆపై వారితో వెట్టిచాకిరీ చేయించుకున్నాడు. పిల్లలను బాలకార్మికులుగా మార్చిన గోవిందరాజన్పై చర్యలు చేపట్టామని తంజావూర్ ఆర్డీవో ఎం రంజిత్ తెలిపారు.