జైపూర్ : రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లాలో దారుణం జరిగింది. మేకలను మేపుతున్న మైనర్ బాలికపై 40 ఏండ్ల వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆపై బాలిక మెడకు తాడుతో ఉరి బిగించేందుకు విఫలయత్నం చేసిన ఘటన కలకలం రేపింది. బార్మర్ జిల్లా సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జునా పత్రసార్ ప్రాంతంలో ఈ ఘటన వెలుగుచూసింది. భోపాల్ సింగ్‌గా గుర్తించిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలిని నిందితుడు సింగ్ బలవంతంగా నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్లి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు.
బాలిక కోసం వెతుకుతున్న కుటుంబ సభ్యులకు గురువారం సాయంత్రం బాధితురాలు కంటపడింది. ఆమె మెడకు గాయం కావడంతో తాడుతో ఊపిరిఆడకుండా చేసేందుకు నిందితుడు ప్రయత్నించాడని పోలీసులు అనుమానిస్తున్నారు. బాలికతో పాటు కుటుంబసభ్యుల స్టేట్మెంట్ను రికార్డు చేసిన పోలీసులు కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు. మైనర్ బాలికపై లైంగిక దాడి ఘటనకు సంబంధించి మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని రాజస్ధాన్ బాలల హక్కుల కమిషన్ జిల్లా ఎస్పీని కోరింది.