అహ్మదాబాద్ : పెండ్లి పేరుతో వితంతువును రూ. 12 లక్షలు మోసగించిన వ్యక్తి ఉదంతం గుజరాత్‌లోని మోర్బి జిల్లాలో వెలుగుచూసింది. నిందితుడిని 56 ఏండ్ల మహేష్ గొసాయిగా గుర్తించిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. జిల్లాలోని అమ్రన్ గ్రామంలో నిందితుడు కిరాణా దుకాణం నిర్వహిస్తున్నాడు.
గత ఏడాది ఫిబ్రవరిలో గొసాయికి మహిళతో ఇన్‌స్టాగ్రాంలో పరిచయం ఏర్పడింది. తాను త్వరలో లండన్‌లో స్ధిరపడేందుకు వెళుతున్నానని ఆమెను పెండ్లి చేసుకుని తనతో పాటు లండన్‌కు తీసుకువెళతానని నమ్మబలికాడు. వీసా ఫీజు, ఇతర ఖర్చుల నిమిత్తం అతడు అడిగిన డబ్బును మహిళ సమకూర్చింది.
మనం ముందుగా కెనడా వెళ్లి ఆ తర్వాత లండన్ వెళ్లాలని సాకులు చెబుతూ పలుమార్లు ఆమె వద్ద డబ్బు గుంజాడు. బంగారు ఆభరణాలను కూడా తనకు పంపాలని కోరాడు. ఇక నిందితుడు తనను మోసగిస్తున్నాడని గ్రహించిన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసి నిందితుడు గొసాయిని అరెస్ట్ చేశారు.
Read More :