అమరావతి : ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ(Ram Gopal Varma) పై మహిళా న్యాయవాదులు ఫిర్యాదు చేశారు. వైస్‌ఛాన్స్‌లర్‌పై కూడా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈనెల 15న ఆచార్య నాగార్జున వర్సిటీ( Nagarjuna Versity )లో జరిగిన కార్యక్రమానికి వైస్‌ఛాన్స్‌లర్(Vice Chancellor)ఆహ్వానం మేరకు రాంగోపాల్ వర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన పలు వ్యాఖ్యలు సంచలనం రేపాయి.
మహిళలను కించపరిచే విధంగా మాట్లాడారని ఆరోపిస్తూ మంగళవారం గుంటూరు జిల్లాకు చెందిన మహిళా న్యాయవాదులు బార్ అసోసియేషన్(Bar Association) ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం పెదకాకాని పోలీసు స్టేషన్లో వీసీ, ఆర్జీవీపై ఫిర్యాదు(Complaint) చేశారు. ఇద్దరిపై చట్టపర చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. మహిళల మనోభావాలు దెబ్బతీసేవిధంగా ఆర్జీవీ వ్యాఖ్యలు ఉన్నాయని మహిళా న్యాయవాదులు ఆరోపించారు. విద్యార్థుల ఎదుట అసభ్యకరంగా వ్యాఖ్యలు చేయడం అసహ్యంగా ఉందని పేర్కొన్నారు. బాధ్యత పదవుల్లో ఉన్న గురువు, వైస్ ఛాన్స్లర్ ఆర్జీవీలాంటి వ్యక్తులను కార్యక్రమాలకు పిలవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
‘ తానొక్కడినే ఐలాండ్‌లో ఉండాలి. చుట్టూ ఆడవాళ్లు ఉండాలని’ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఆర్జీవీ మహిళలను విలాసవస్తువుగా చూస్తున్నాడని విమర్శించారు. సామాజిక బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్న ఆర్జీవీపై చట్ట పరమైన చర్యలు తీసుకునేంత వరకు తమ ఆందోళనను కొనసాగిస్తామని మహిళా న్యాయవాదులు వెల్లడించారు. పెదకాకాని స్టేషన్ సీఐ సురేశ్‌బాబు మాట్లాడుతూ మహిళా న్యాయవాదులు ఆర్జీవీ, వీసీపైల ఫిర్యాదు చేశారని వారి ఫిర్యాదును న్యాయ సలహాకు పంపించామని అక్కడి నుంచి వచ్చే అభిప్రాయం మేరకు ఇద్దరిపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.