అమరావతి: రైలులో (Train) నుంచి కింద పడిన భార్యను కాపాడబోయిన భర్త మృతి చెందిన ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాలో చోటుచేసుకున్నది. కర్ణాటకలోని ఉడిపి జిల్లా చిరూరుకు చెందిన సయ్యద్ ఆసిఫ్, అసియాబాను దంపతలులు ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ జనరల్ బోగీలో ఫుట్‌బోర్డుపై కూర్చొని ప్రయాణం చేస్తున్నారు. ఈ క్రమంలో నంద్యాల జిల్లా ఎర్రగంట్ల వద్ద నిద్రమత్తులో ఉన్న అసియాబాను రైలులో నుంచి కిందపడిపోయింది.
గమనించిన సయ్యద్.. ఆమెను కాపాడేందుకు రైలులో నుంచి దూకాడు. దీంతో తీవ్రంగా గాయపడి మృతిచెందాడు. అయితే అసియాబాను మాత్రం తీవ్రగాయాలతో బయటపడింది. ఆమెను చికిత్స నిమిత్తం డోన్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కాగా, నాలుగు నెలల క్రితమే వారు ప్రేమ వివాహం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారు గుంటూరు నుంచి బెంగళూరుకు వెళ్తున్నట్లు చెప్పారు.