లక్నో : బాలికపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి ఆమెకు అబార్షన్ చేయించి చేతులు దులుపుకున్న ఘటన యూపీలోని మీరట్ జిల్లాలో వెలుగుచూసింది. ఈ ఘటన వెలుగులోకి రావడంతో గ్రామ పంచాయితీ నిందితుడిని రూ 2 లక్షలు చెల్లించాలని కోరింది. మూడేండ్లు గ్రామానికి దూరంగా ఉండాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఈ ఉదంతం తమ దృష్టికి రాలేదని పోలీసులు తెలిపారు. సర్ధాన పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామంలో జరిగిన ఈ ఘటనలో నిందితుడు బీఏ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. తన పొరుగున ఉండే బాలికతో సన్నిహితంగా మెలుగుతూ ఆమెను లోబరుచుకున్నాడు.
బాధితురాలు గర్భం దాల్చగా ఆమెకు అబార్షన్ చేయించాడని స్ధానికులు పేర్కొన్నారు. అబార్షన్ అనంతరం బాలిక ఆరోగ్యం దిగజారడంతో జరిగిన విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులకు తెలిపింది. బాధితురాలు, నిందితుడు వేర్వేరు వర్గాలకు చెందడంతో ఈ వివాదం పంచాయితీకి చేరింది. చివరికి నిందితుడుని మూడేండ్లు గ్రామం విడిచివెళ్లాలని రూ రెండు లక్షలు జరిమానా చెల్లించాలని పంచాయితీ తేల్చింది. పంచాయితీ నిర్ణయానికి బాలిక తండ్రి అంగీకరించాడని గ్రామ పెద్దలు చెప్పుకొచ్చారు. ఇక పంచాయితీ తీర్పు విషయం తమకు తెలియదని, తమకు ఫిర్యాదు అందితే దీనిపై చర్యలు చేపడతామని సర్ధానా పోలీస్ అధికారి ఆర్పీ షహి చెప్పారు.