బెంగళూర్ : 2018లో మైనర్ బాలిక (16)ను అపహరించి బలవంతంగా వివాహం చేసుకుని లైంగిక దాడికి పాల్పడిన కేసులో దోషి (29)కి తుంకూర్లో ప్రత్యేక న్యాయస్ధానం పదేండ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ 50,000 జరిమానా విధించింది. నిందితుడు అంజన్ మూర్తిని తుంకూర్ మహిళా పోలీస్ స్టేషన్ పోలీసులు 2018లో పోక్సో సహా బాల్య వివాహాల నిషేధ చట్టం ఇతర సెక్షన్ల కింద అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి నిందితుడు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అంజన్ 2018 అక్టోబర్ 20న 16 ఏండ్ల బాలికను ఆమె ఇంటి నుంచి అపహరించి మూడు నెలలు ఆమెతో కలిసి నివసించాడు.
బాలిక కొన్నేండ్ల కిందట తల్లిని కోల్పోయింది. ఆపై బాలికను ఆలయంలో వివాహం చేసుకోగా కొద్దిరోజులకు మైనర్ గర్భం దాల్చింది. బాధితురాలి మామ తన మేనకోడలు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అదే ఏడాది డిసెంబర్ 24న అంజన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలిక గర్భం కోల్పోవడంతో నిందితుడు, బాధితురాలి రక్తనమూనాలను సేకరించి డీఎన్ఏ పరీక్షలు నిర్వహించగా తండ్రి ఎవరన్నది నమూనాల్లో వెల్లడికాలేదు. గర్భం దాల్చిన ఒకట్రెండు నెలల్లోనే నమూనాలను పరీక్షిస్తే తండ్రి డీఎన్ఏ వెల్లడికాదని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించగా నిందితుడి డీఎన్ఏ నమూనాలు పిండం డీఎన్ఏతో సరిపోలనందున నిందితుడిని దోషిగా నిర్ధారించలేమని డిఫెన్స్ న్యాయవాది కోర్టుకు నివేదించారు.
అయితే పిండం వయసు నెలరోజులే కావడంతో తండ్రి డీఎన్ఏ వివరాలు వెల్లడి కావని ఎఫ్ఎస్ఎల్ శాస్త్రవేత్తలు నివేదికలో పేర్కొన్నారు. అయితే వైద్య నివేదికలు, ప్రత్యక్ష సాక్షులు వెల్లడించిన వివరాల ప్రకారం నిందితుడు బాధితురాలితో బలవంతంగా శారీరక సంబంధం ఏర్పరచుకున్నాడని స్పష్టమైందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టు దృష్టికి తీసుకువెళ్లడంతో అంజన్ను దోషిగా నిర్ధారిస్తూ ప్రత్యేక న్యాయస్ధానం అతడికి పదేండ్ల జైలు శిక్ష, రూ 50,000 జరిమానా విధిస్తూ ఉత్తర్వులు వెలువరించింది.