బొంరాస్పేట : గుర్తు తెలియని వ్యక్తి సిమెంటు లారీని చోరీ చేసి తీసుకెళ్తుండగా అదుపుతప్పి బోల్తా పడిన సంఘటన బుధవారం తెల్లవారుజామున పోలీసు స్టేషన్ పరిధిలోని దుద్యాల గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. టీఎస్07యూఎల్2261 నంబరు గల లారీ సిమెంటు బస్తాల లోడుతో మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత తాండూరు నుంచి హైదరాబాద్కు బయలుదేరాడు. బుధవారం తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో కొడంగల్ పట్టణంలోని చౌరస్తాలో లారీని నిలిపి టీ తాగడానికి డ్రైవరు సత్తారు కిందికి దిగాడు. దీనిని గమనించిన గుర్తు తెలియని వ్యక్తి లారీని స్టార్ట్ చేసుకుని వెళ్లాడు. డ్రైవరు వచ్చి చూసే సరికి లారీ కనిపించకపోవడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.
పోలీసులు లారీని పట్టుకోవడానికి వెంబడించగా దుద్యాల గ్రామ సమీపంలో లారీ బోల్తాపడి ఉంది. లారీని చోరి చేసిన గుర్తు తెలియని వ్యక్తి పరారీలో ఉన్నాడని, డ్రైవరు సత్తార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు కొడంగల్ సీఐ అప్పయ్య తెలిపారు.