
కడ్తాల్ : యాజమానికే టోకర వేసి డబ్బుతో ఉడాయించిన దొంగను పోలీసులు అరెస్ట్ చేసి, నగదు స్వాధీనం చేసుకున్న సంఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఎస్ఐ హరిశంకర్‌గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఎండీ ఆజీమ్, రాజుఖాన్ అలియాస్ పటాన్రాజుతో పాటు మరికొంతమంది కలిసి కొన్ని సంవత్సరాల క్రితం మండల కేంద్రంలో ఇంజినీరింగ్ వర్క్‌షాప్‌ని పెట్టుకుని జీవనోపాధి పొందుతున్నారు. సెప్టెంబర్ 20న షాపులోకి కొత్త సామాను కొందామని ఆజీమ్ తెలిసిన వారి దగ్గర రూ. 13,45,000 లక్షలను తీసుకున్నాడు. అదే రోజు రాత్రి ఆజీమ్ తన వద్ద పని చేస్తున్న రాజుఖాన్ రూం వద్ద నగదును అప్పజెప్పి, తిరిగి షాపుకి వచ్చి పడుకున్నాడు.
రాత్రి అందరూ పడుకున్న తర్వాత ఆజీమ్ ఇచ్చిన డబ్బును తీసుకోని రాజుఖాన్ పారిపోయాడు. సెప్టెంబర్ 21న ఉదయం రాజుఖాన్తో పాటు డబ్బు కనిపించకపోవడంతో, దొంగతనం జరిగిందని గమనించి ఆజీమ్ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న ఎస్ఐ హరిశంకర్‌గౌడ్ ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారు. ఈ నెల 3న ఎంజీబీఎస్ బస్టాండ్‌లో రాజుఖాన్ని పట్టుకోని అరెస్ట్ చేశారు. అతని నుంచి రూ. 9,90,000లు రికవరీ చేసి, రిమాండ్ చేసినట్లు ఎస్ఐ తెలిపారు. దొంగను పట్టుకోవడంలో చాకచాక్యంగా వ్యవహరించిన కానిస్టేబుళ్లు గోపాల్, రామ్‌కోటిని ఎస్ఐ అభినందించారు.