భోపాల్ : మధ్యప్రదేశ్లోని ఖండ్వా జిల్లాలో కొటి గ్రామంలోని కాలువలో నలుగురు బాలికలు ప్రమాదవశాత్తూ మునిగిపోయారు. కాలువలో స్నానం చేసేందుకు 11 మంది బాలికలు వెళ్లగా వారిలో ఆరుగురు కొట్టుకుపోయారు. వారిలో ఇద్దరిని కాపాడగా మరో నలుగురు మరణించారు. గ్రామంలోని సంవిద్ గురుకులం రెసిడెన్షియల్ స్కూల్లో వీరంతా ఐదో తరగతి చదువుతున్నారు.
ఓంకారేశ్వర్ డ్యామ్నకు చెందిన కాలువలో స్నానం చేసేందుకు బుధవారం ఉదయం బాలికలు వెళ్లగా వైశాలి నావల్ సింగ్ అనే 13 ఏండ్ల బాలిక నీటి ప్రవాహంలో పడిపోయింది. ఆమెను కాపాడేందుకు ఒకరి తర్వాత ఒకరు ముగ్గురు బాలికలు నదిలో దూకి నీటి ప్రవాహానికి చిక్కుకున్నారు. ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో నలుగురి మృతదేహాలను బయటకు తీసుకువచ్చారు.
బాత్రూంలో నీళ్లు రాకపోవడంతో నదిలో స్నానం చేయాలని తాము ఇక్కడకు వచ్చామని ఓ బాలిక తెలిపింది. విద్యార్ధినులు స్నానం చేసేందుకు స్కూల్లో సరైన వసతులు లేవని బాలికల తల్లితండ్రులు ఆరోపించారు. దీంతో వారు కాలువలో స్నానానికి వెళ్లకతప్పడం లేదని వాపోయారు. బాలికలను కేవలం ఏప్రిల్లోనే స్కూల్కు పిలిపించినా అప్పుడు కూడా వారికి సరైన సౌకర్యాలు కల్పించడం లేదని అన్నారు.