లక్నో : యూపీలో చిన్నారులు, బాలికలు, మహిళలపై లైంగిక వేధింపులకు బ్రేక్ పడటం లేదు. ముజఫర్‌నగర్‌లో 9 ఏండ్ల బాలికపై 71 ఏండ్ల ప్రిన్సిపల్ లైంగిక దాడికి పాల్పడిన ఘటన వెలుగుచూసిన అనంతరం మరో దారుణ ఉదంతం బయటకువచ్చింది. షహరన్‌పూర్‌లో దళిత బాలికపై అతడి సీనియర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆపై బాధితురాలితో బలవంతంగా విషం తాగించడంతో ఆమె తనువు చాలించిన ఘటన కలకలం రేపింది.
ఈ ఘటనలో నిందితుడిని స్కూల్లో ఆమె సీనియర్ (16)గా గుర్తించారు. గురువారం ఈ ఘటన జరగ్గా నిందితుడిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. బాలిక స్కూల్ నుంచి అదృశ్యమై అదేరోజు సాయంత్రం గ్రామంలోని పంటపొలంలో అచేతనంగా పడిఉంది. బాలికను ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించింది. బాలికకు బహుమతుల ఆశ చూపి నిందితుడు బయటకు తీసుకువచ్చి ఘోరానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.
గురువారం ఉదయం స్కూల్‌కు వెళ్లిన బాలిక ఎంతకీ తిరిగిరాకపోవడంతో బాధితురాలి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు తరగతి గదిలో బాలిక బ్యాగ్ ఉన్నా ఆమె కనిపించడం లేదని టీచర్ బాలిక కుటుంబసభ్యులకు తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకు తరలించామని షహరన్‌పూర్ ఎస్పీ రాజ్‌ష్ కుమార్ వెల్లడించారు.