హుస్నాబాద్/సిద్దిపేట : హుస్నాబాద్ పట్టణంలోని శివాలయం వీధిలోని ఓ ఇంట్లో బుధవారం పట్టపగలే చోరీ జరిగింది. పట్టణంలో పోస్టుమ్యాన్‌గా పనిచేసే గూల్ల ఎల్లయ్య-శ్రీమతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాళం పగులగొట్టి ఇంట్లోకి చొరబడిన దుండగులు ఆరు తులాల బంగారం, రూ.70వేల నగదు, 22తులాల వెండి అపహరించుకుపోయారు.
స్థానిక సీఐ రఘుపతిరెడ్డి, బాధితులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఉదయం ఎల్లయ్య తన డ్యూటీకి వెళ్లగా 11గంటల సమయంలో ఆయన భార్య శ్రీమతి చిట్టీ కట్టేందుకు బయటకు వెళ్లింది. సుమారు గంట వరకు తిరిగి వచ్చే సరికి ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయి.
ఇంట్లో దొంగలు ఉన్నారంటూ అరవడంతో చుట్టుపక్కల వాళ్లు వచ్చి ఇంట్లో చూడగా అప్పటికే దొంగలు పారిపోయారు. ఇంట్లోకి వెళ్లి చూడగా కిచెన్‌లోని స్టీలు డబ్బాల్లో ఉంచిన బంగారం, వెండి వస్తువులు, నగదు కనిపించలేదు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
సంఘట స్థలానికి చేరుకున్న సీఐ రఘుపతిరెడ్డి క్లూస్‌టీంను రప్పించి వేలిముద్రలను సేకరించారు. బాధితులతో మాట్లాడి సంఘటన వివరాలు తెలుసుకున్నారు. బాధితుడు ఎల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, త్వరలోనే నిందితులను పట్టుకుంటామని సీఐ రఘుపతిరెడ్డి తెలిపారు.