న్యూఢిల్లీ : నటి, బీజేపీ నేత సొనాలి ఫోగట్ మర్డర్ మిస్టరీలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. నటి గుండెపోటుతో మరణించిందని తొలుత వెల్లడించగా ఆపై పోస్ట్మార్టం నివేదిక అనంతరం హత్య కేసుగా నిర్ధారించి ఆమె ఇద్దరు సహాయకులపై కేసు నమోదు చేశారు. మరోవైపు బీజేపీ నేతకు పార్టీలో బలవంతంగా డ్రగ్స్ ఇచ్చారని, డ్రగ్స్ సేవించడం ఆమె మరణానికి దారితీసిందని గోవా పోలీసులు తెలిపారు.
గోవా ఇన్స్పెక్టర్ జనరల్ ఓంవీర్ సింగ్ విష్ణోయ్ విలేకరులతో మాట్లాడుతూ పార్టీలో సొనాలి ఫోగట్కు ఓ అనుమానితుడు బలవంతంగా మత్తుపదార్ధం అందించాడని, ఆ కెమికల్ సేవించిన అనంతరం ఆమె తనపై పట్టు కోల్పోయిందని చెప్పారు. స్ప్రహ కోల్పోయిన అనంతరం అనుమానితుడు ఆమెను టాయిలెట్లోకి తీసుకువెళ్లాడని, ఆపై రెండు గంటల పాటు ఏం జరిగిందనేది వెల్లడి కావడం లేదని చెప్పారు. ఆమె సహాయకులు ఇద్దరినీ గోవా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఫోరెన్సిక్ బృందం వారిద్దరినీ పలు ప్రాంతాలకు తీసుకువెళ్లిందని వారిని త్వరలోనే కోర్టు ఎదుట హాజరుపరుస్తామని విష్ణోయ్ తెలిపారు. డ్రగ్స్ ప్రభావంతో ఆమె మరణించినట్టు తెలుస్తోందని ఆయన పేర్కొన్నారు. సొనాలీ ఫోగట్ సహాయకులను సుధీర్ సగ్వన్, సుఖ్విందర్ వసీగా గుర్తించారు. ఫోగట్ సోదరుడు రింకు ధాకా వీరిద్దరిపై గోవా పోలీసులకు ఫిర్యాదు చేశారు.