Fire Accident | సికింద్రాబాద్ మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలక్ట్రికల్ స్కూటర్ షోరూంలో సోమవారం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నది. బ్యాటరీ షోరూమ్‌లో షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగాయి. షోరూమ్పైన ఉన్న రూబీ హోటల్లోకి మంటలు, దట్టమైన పొగ వ్యాపించడంతో ఏడుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డట్లు సమాచారం. లాడ్జిలో చిక్కుకున్న వారిని పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రమాద ఘటన తెలియగానే రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ చేరుకున్నారు. సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
గ్రౌండ్ ఫ్లోర్లో ఎలక్ట్రిక్ స్కూటర్ షోరూమ్ నడుస్తుండగా.. నాలుగు అంతస్తుల్లో రూబీ హోటల్, దాని లాడ్జి నిర్వహిస్తున్నారు. భారీ ఎత్తున మంటలు చెలరేగి.. దట్టమైన పొగ కమ్ముకోవడంతో ఆందోళనకు గురైన కొందరు టూరిస్టులు హోటల్‌పై నుంచి దూకినట్లు తెలుస్తోంది. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మొత్తంగా లాడ్జిలో ఎంత మంది చిక్కుకున్నారన్న విషయం తెలియడం లేదు. లాడ్జి లోపల అపస్మారక స్థితిలో ఉన్న వారిని బయటకు వెలికి తీసి.. గాంధీకి తరలిస్తున్నారు.