న్యూఢిల్లీ : నకిలీ ఆన్లైన్ ఫ్లైట్ టికెట్ రాకెట్‌ను ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు. ఓ అధికారిక కార్యక్రమానికి హాజరయ్యేందుకు కెనడాకు విమాన టికెట్‌ను బుక్ చేసుకున్న ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఈ ముఠా చేతిలో మోసపోవడంతో ఈ రాకెట్ గుట్టు రట్టయింది.
ఏప్రిల్ తొలి వారంలో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు కెనడాకు వెళ్లేందుకు డీయూ ప్రొఫెసర్ తన స్టూడెంట్ ద్వారా టికెట్లు బుక్ చేయించాడు. సులేఖ అప్లికేషన్లో ప్రొఫెసర్ స్టూడెంట్ బుకింగ్స్ కోసం ఎంక్వయిరీ చేయగా పలు కాల్స్ వచ్చాయి. ప్రవీణ్ తివారీ అనే ఏజెంట్ కేఎల్ఎం ఎయిర్‌లైన్స్‌లో టికెట్లను బుక్ చేసి వాట్సాప్‌లో టికెట్ కాపీలను పంపాడు. ఏజెంట్ సూచనలకు అనుగుణంగా ప్రొఫెసర్ రూ 1.5 లక్షలను ఏజెంట్ బ్యాంక్ ఖాతాలో డిపాజిట్ చేశాడు.
ఆపై ఎయిర్‌లైన్ కంపెనీలో తమ టికెట్ వివరాలను చెక్ చేసుకోగా ఆ టికెట్లు నకిలీవని వెల్లడైంది. ఏజెంట్ ఫోన్ స్విచాఫ్ కావడంతో మోసపోయానని గ్రహించిన ప్రొఫెసర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితులను యూపీ, హర్యానాలకు చెందిన ప్రవీణ్ తివారీ, రోహిత్ కుమార్‌గా గుర్తించారు. ఇదే తరహాలో నిందితులు పలువురిని మోసగించారని పోలీసులు తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు.