గురువారం 21 జనవరి 2021
Crime - Dec 08, 2020 , 20:34:47

ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌ తండ్రి కన్నుమూత

ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌ తండ్రి కన్నుమూత

క్రైస్ట్‌చర్చ్‌:ఇంగ్లాండ్‌ క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ విన్నింగ్‌ హీరో, ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌ తన తండ్రిని కోల్పోయాడు.   బ్రెయిన్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్న బెన్‌స్టోక్స్‌  తండ్రి జెడ్‌ స్టోక్స్‌(65) మంగళవారం న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్‌లో తుదిశ్వాస విడిచారు. మాజీ అంతర్జాతీయ రగ్బీ లీగ్‌  ఆటగాడు, కోచ్‌ అయిన  జెడ్‌ చాలా రోజుల నుంచి క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. 2019 క్రిస్మస్‌ పండుగకు కొద్దిరోజుల ముందు జెడ్‌ మొదటిసారిగా అనారోగ్యానికి గురయ్యారు.  ఈ ఏడాది జనవరిలో జెడ్‌కు క్యాన్సర్‌ సోకినట్లు వైద్యులు గుర్తించారు.   

ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ గా బెన్‌స్టోక్స్‌ నిలిచిన విషయం తెలిసిందే.  బెన్‌ స్టోక్స్‌   క్రైస్ట్‌చర్చ్‌లో జన్మించాడు.  అతడు 12ఏండ్ల వయసులో ఉండగా  స్టోక్స్‌ కుటుంబం నార్తర్న్‌ ఇంగ్లాండ్‌కు మారింది. రగ్బీ లీగ్‌ కోచింగ్‌ కాంట్రాక్ట్‌ నిమిత్తం  జెడ్‌ కుటుంబంతో కలిసి కంబ్రియాలో    స్థిరపడ్డారు. ఇక అక్కడే క్రికెట్‌లోకి అడుగుపెట్టిన    స్టోక్స్‌  ప్రపంచ అత్యుత్తమ ఆల్‌రౌండర్‌గా ఎదిగాడు. 

బెన్‌స్టోక్స్‌ తన తండ్రి యోగక్షేమాలు చూసుకునేందుకు ఈ ఏడాది చాలా రోజుల పాటు అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి విరామం తీసుకున్నాడు. తండ్రి ఆరోగ్యం విషమించడంతో  దుబాయ్‌ వేదికగా జరిగిన  ఐపీఎల్‌-2020 సీజన్‌ తొలి అంచె పోటీలకు  రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన   స్టోక్స్‌ దూరమైన విషయం తెలిసిందే. 


logo