ఖానాపూర్‌రూరల్ : భారతదేశం టెక్నాలజీ రంగంలో అన్ని దేశాల కంటే ముందంజలో ఉంటున్న తరుణంలో ఇంకా మూఢచారాల పేరిట పలు చోట్ల దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. మంత్రాల నెపంతో ఓ వృద్ధున్ని దారుణంగా హత్య చేసిన ఘటన ఖానాపూర్ పట్టణంలో చోటు చేసుకుంది. సీఐ అజయ్‌బాబు కథనం ప్రకారం.. పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన బోయిని పెద్ద రాజన్న (68) శుక్రవారం రాత్రి ఇంటికి సమీపంలో ఉన్న హోటల్‌కు టీ తాగడానికి వెళ్లి తిరిగి వస్తుండగా అప్పటికే మాటు వేసిన అదే కాలనీకి చెందిన కృపాకర్, రాకేశ్‌లు అతడిపై దాడి చేసి కత్తులతో పొడిచారు.
తీవ్రంగా గాయపడ్డ పెద్ద రాజన్నను బంధువులు హుటాహుటిన దవాఖానకు తరలించారు. మెరుగైన చికిత్స కోసం నిర్మల్ దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడని సీఐ తెలిపారు. ఇంటికి మంత్రాలు చేస్తున్నాడనే నేపంతో హత్యకు పాల్పడిన నిందితులు పరారీలో ఉన్నారన్నారు. వారిని త్వరలోనే పట్టుకొని వారిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. మృతునికి ముగ్గురు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. హత్య ఘటన స్థలాన్ని డీఎస్పీ ఉపేందర్ రెడ్డి సందర్శించారు.