న్యూఢిల్లీ : దేశ రాజధానిలోని స్కూల్ తరగతి గదిలోకి చొరబడి ఇద్దరు బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన అనుమానితుడి ఊహా చిత్రాలను ఢిల్లీ పోలీసులు గురువారం విడుదల చేశారు. ఈశాన్య ఢిల్లీలోని ఓ స్కూల్లో ఏకంగా క్లాస్‌రూంలోనే ఇద్దరు బాలికలతో ఓ వ్యక్తి అభ్యంతరకరంగా ప్రవర్తించడం కలకలం రేపింది. బాలికల దుస్తులు తొలగించి లైంగిక వేధింపులకు గురిచేయడమే కాకుండా విద్యార్ధుల ఎదుటే మూత్ర విసర్జన చేశాడు.
విద్యార్ధులు ఈ విషయం క్లాస్ టీచర్‌కు, ప్రిన్సిపల్‌కు తెలిపినా బయటకు వెల్లడించవద్దని విద్యార్ధులను వారించారని ఢిల్లీ మహిళా కమిషన (డీసీడబ్ల్యూ) పేర్కొంది. డీసీడబ్ల్యూ చొరవతో అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. స్కూల్ ఎంట్రన్స్ వద్ద సీసీటీవీలు ఏర్పాటు చేయలేదని, ఈ ప్రాంతంలో పలు సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించి అనుమానితుడిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు.
అనుమానితుడు ఆరంజ్ రంగు షర్ట్ ధరించి ఉన్నాడని ప్రాధమిక దర్యాప్తులో గుర్తించారు. బాలికలు తెలిపిన ఆధారాలతో అనుమానితుడి ఊహాచిత్రం తయారైందని ఇద్దరు అనుమానితులను గుర్తించామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులకు మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసిందని తూర్పు ఎంసీడీ కమిషనర్‌కు సమన్లు జారీ చేశామని డీసీడబ్ల్యూ చీఫ్ స్వాతి మలివాల్ తెలిపారు. నేరానికి సంబంధించిన సమాచారం ఢిల్లీ పోలీసులకు చేరవేయనందుకు స్కూల్ ప్రిన్సిపల్, క్లాస్ టీచర్‌పై పోక్సో చట్టం కింద చర్యలు చేపట్టాలని ఆమె కోరారు.