మహబూబ్ నగర్ : కాపురానికి వెళ్లనన్న నవ వధువును తండ్రే దారుణంగా హత్య చేశాడు. నవ వధువుతో పాటు ఆమె తల్లిని చంపాడు. అనంతరం తాను విష గుళికలు మింగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ దారుణ ఘటన మహబూబ్నగర్ మండలం జైనల్లిపూర్ గ్రామంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. జైనల్లిపూర్ గ్రామానికి చెందిన దయల్ల కృష్ణయ్యకు భార్య కలమ్మ(43), కుతూరు సరస్వతి (23) , ఒక కుమారుడు ఉన్నాడు. ఈ ఏడాది మే 8వ తేదీన కూతురు సరస్వతికి వివాహం జరిగింది. తనకు ఇష్టం లేని పెళ్లి చేశారని, కాపురానికి వెళ్ళనని తండ్రికి సరస్వతి చెప్పింది. దీంతో సరస్వతి, కలమ్మతో కృష్ణయ్య గొడవపడ్డాడు. ఎంత చెప్పినా వినక పోవడంతో ఇంట్లో ఉన్న కర్రతో సరస్వతి, కలమ్మపై తీవ్రంగా బాదాడు. అనంతరం తాను విష గుళికలు మింగి కుమారుడికి ఫోన్లో సమాచారం అందించారు. పొలం వద్ద ఉన్న కుమారుడు హుటాహుటిన ఇంటికి చేరుకున్నాడు. తలుపులు పగులగొట్టి చూడగా, సరస్వతి, కలమ్మ, కృష్ణయ్య కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. సరస్వతి, కలమ్మను హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే చనిపోయారు. ప్రభుత్వ జిల్లా హాస్పిటల్లో కృష్ణయ్య చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతురాలి తమ్ముడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు, నిందితుడు కృష్ణయ్యపై కేసు నమోదు చేసినట్లు మహబూబ్నగర్ రూరల్ సిఐ మహేశ్వర రావు తెలిపారు. అయితే నిందితుడికి తాగుడు అలవాటు లేదని పోలీసులు తెలిపారు.