పరిగి : అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ మృతిచెందిన సంఘటన పరిగి పోలీసు స్టేషన్ పరిధిలోని సయ్యద్ మల్కాపూర్ శివారులో చోటు చేసుకుంది. పరిగి ఎస్ఐ విఠల్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం 7గంటల సమయంలో సయ్యద్‌మల్కాపూర్ సమీపంలోని ఓ ట్రాక్టర్ షోరూం సమీపంలో గుర్తు తెలియని మహిళ(35) శవం లభించింది. శవాన్ని పరిగి దవాఖానకు తరలించి పరిశీలించగా శరీరంపై ఎలాంటి గాయాలు లేవు. నుదుటిపై చిన్నగా గీసిన గాయం మినహా ఎక్కడా గాయాలు లేవు.
ఆమె వద్ద ఉన్న ఫోన్ నంబర్ ఆధారంగా వివరాలు సేకరించగా ఆమె పేరు శివమ్మ, మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మహిళగా తెలిసిందని ఎస్ఐ పేర్కొన్నారు. సయ్యద్‌మల్కాపూర్ గ్రామపంచాయతీ కార్యదర్శి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.