Crime news : కదులుతున్న రైలులో ప్రయాణికుడి నుంచి మొబైల్ ఫోన్ (Mobile Phone) లాక్కోవడానికి ప్రయత్నించిన ఓ దొంగ (Thief) కు ప్రయాణికులు ఊహించని రీతిలో బుద్ధి చెప్పారు. మొబైల్ లాక్కునేందుకు దొంగ చేయి లోపలికి పెట్టగా.. ప్రయాణికులు ఆ చేతిని లోపలి నుంచి గట్టిగా లాగి పట్టుకున్నారు. ఇంతలో రైలు కదలడంతో తర్వాతి స్టేషన్‌కు చేరుకునేంత వరకు దాదాపు 9 కిలోమీటర్ల దూరం దొంగ గాల్లో వేలాడుతూ వెళ్లాడు. బీహార్ (Bihar) లోని బరౌని-కతిహార్ రైల్వే సెక్షన్లో ఈ నెల 9న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. జనహిత్ ఎక్స్‌ప్రెస్ ఖగారియా జిల్లాలోని మాన్సి స్టేషన్లో ఆగి ఉన్నప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి ప్లాట్‌ఫామ్ మీద నుంచి కిటికీ గుండా లోపలున్న ప్రయాణికుడి మొబైల్ ఫోన్ లాగేందుకు ప్రయత్నించాడు. అప్రమత్తమైన ప్రయాణికులు వెంటనే అతడి చేయి పట్టుకున్నారు. ఇంతలోనే రైలు కదలడం మొదలుపెట్టింది. దాంతో ఆ దొంగ తన చేయిని విడిపించుకోలేక, కదులుతున్న రైలు బయట కిటికీకి వేలాడుతూ ప్రయాణించాల్సి వచ్చింది.
మాన్సి స్టేషన్ నుంచి తదుపరి స్టేషన్ అయిన ఖగారియా వరకు సుమారు 15 కిలోమీటర్లపాటు ప్రయాణికులు అతడి చేయిని వదల్లేదు. మధ్యలో ట్రాక్‌పై ఉన్న దొంగ సహచరులు అతడిని విడిపించేందుకు ప్రయత్నించినా ఫలించలేదు. చివరకు ఖగారియా స్టేషన్ రాగానే అతడిని కిందకు దించి, అక్కడున్న ప్రభుత్వ రైల్వే పోలీసులకు అప్పగించారు. నిందితుడిని భాగల్పూర్ జిల్లా నౌగచియాకు చెందిన మహ్మద్ ఫఖ్రుద్దీన్గా గుర్తించినట్లు జీఆర్పీ అధికారులు తెలిపారు.