హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఎంఎన్‌జే తర్వాత రెండో అతిపెద్ద క్యాన్సర్ దవాఖానను వరంగల్ లో ఏర్పాటు చేస్తామని ఆరోగ్యశాఖ మం త్రి దామోదర రాజనర్సింహ ప్రకటించా రు. మంగళవారం సచివాలయంలో వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల్లో ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై మంత్రి కొండా సురేఖతో కలిసి నిర్వహించిన సమీక్షలో మంత్రి దామోదర మాట్లాడుతూ.. ఉమ్మడి వరంగల్ జిల్లాతోపాటు ఉత్తర తెలంగాణ ప్రజలకు అత్యాధునిక క్యాన్సర్ వైద్య సేవలు అందించే విధంగా రీజినల్ క్యాన్సర్ దవాఖానను అభివృ ద్ధి చేస్తామని చెప్పా రు. వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను ఈ ఏడాది చివరికల్లా అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. ఎంజీఎంలో ప్రస్తుతం 29 స్పెషాలిటీల్లో వైద్య సేవలు అందిస్తుండగా.. మరో 9 సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. ఎంజీఎంకు అడిషనల్ మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌ను రెగ్యులర్ సూపరింటెండెంట్‌గా నియమిస్తామని ప్రకటించారు. సమీక్షలో ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కడియం శ్రీహరి, నాయిని రాజేందర్‌రెడ్డి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, యశస్వినీరెడ్డి, కేఆర్ నాగరాజు పాల్గొన్నారు.