హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ)/చేర్యాల: తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్‌పై కొమురవెల్లి మల్లన్నస్వామి ఆశీస్సులు ఉండాలని, ఆయన మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రార్థిస్తూ బీసీ జనసభ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు డీ రాజారామ్‌యాదవ్ ఆధ్వర్యంలో కొమురవెల్లి మల్లన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేసీఆర్‌కు ఎలాంటి ఆపద రాకూడదని, ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ మల్లన్నస్వామి సన్నిధిలో 21 పట్నాలు వేసి పూజలు చేశారు.
కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి తెలంగాణ ప్రజలకు మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేయాలని, రాష్ట్రానికి అండగా నిలువాలని కోరుకున్నారు. ఈ సందర్భంగా రాజారామ్‌యాదవ్ మాట్లాడుతూ.. కొమురవెల్లి మల్లన్న దయతో కేసీఆర్ రాష్ర్టాన్ని సాధించారని, రైతాంగానికి సాగునీరు అందించేందుకు మల్లన్నస్వామి పేరిట మల్లన్నసాగర్ నిర్మించారని చెప్పారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కక్షపూరిత విధానాలతో నేడు మల్లన్నసాగర్ వెలవెలబోతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు.
రాష్ట్రంలో అన్నివర్గాల ప్రజలు అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు వస్తాయని ఎదురుచూస్తున్నారని, కాంగ్రెస్ పోవాలి, కేసీఆర్ రావాలనేది ప్రజల ఆకాంక్షగా ఉన్నదని చెప్పారు. కార్యక్రమంలో గొర్రెల కాపరుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోచబోయిన శ్రీహరియాదవ్, కొమురవెల్లి దేవస్థానం మాజీ చైర్మన్ సెవెల్లి సంపత్‌కుమార్ కురుమ, గొర్రెల కాపరుల సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు అయోధ్యయాదవ్ తదితరులు పాల్గొన్నారు.