కొత్తూరు రూరల్ : అల్లారు ముద్దుగా పెంచిన కూతురు మృతి చెందటంతో తీవ్ర మనస్తాపానికి గురై తండ్రి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కొత్తూరు మున్సిపాలిటి కేంద్రంలో చోటు చేసుకుంది. హెడ్‌కానిస్టేబుల్ సంపత్ తెలిపిన కథనం ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా, బాలానగర్ మండలం, గౌతపూర్ గ్రామానికి చెందిన ఆవులమంద సత్యనారాయణ అలియాస్ సత్యం(35) తన భార్య జ్యోతితో కలిసి కొంతకాలం క్రితం జీవనోపాధి కోసం కొత్తూరు మున్సిపాలిటీ కేంద్రానికి వచ్చి ట్రాక్టర్ మెకానిక్‌గా స్థిరపడ్డాడు. వీరికి కూతురు భానుప్రియ(6) ఉంది. ఈ నేపథ్యంలో చిన్నారి భానుప్రియ అనారోగ్యాంతో గతేడాది మృతి చెందింది. దీంతో తండ్రి సత్యం తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.
మనస్తాపానికి గురైన సత్యం ఈ నెల 8న అర్థరాత్రి భార్య నిద్రిస్తున్న సమయంలో బెడ్రూంలో ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిద్రలో మెలకువ వచ్చిన జ్యోతి ఉరేసుకున్న భర్తను చూసి ఇరుగుపొరుగువారికి తెలిపింది. దీంతో వారు పోలీసులకు సమాచారాన్ని అందించటంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. సంఘటనపై మృతుడి అన్న ఆవులమంద రమేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు.