Road Accident | ముంబై : మహారాష్ట్రలోని ధులే జిల్లాలో మంగళవార ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ట్రక్కు అదుపుతప్పి కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పది మంది అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
వివరాల్లోకి వెళ్తే.. ధులే జిల్లా పరిధిలో మంగళవారం ఉదయం 10:45 గంటల సమయంలో ముంబై – ఆగ్రా హైవేపై వేగంగా దూసుకెళ్తున్న ట్రక్కు.. అదుపుతప్పి ముందు వెళ్తున్న కారును ఢీకొట్టింది. దీంతో కారు రోడ్డుపక్కకు ఎగిరిపడింది. రోడ్డు పక్కన నిల్చున్న వారు కూడా గాల్లో ఎగిరిపడ్డారు. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు, మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ధులే, సిర్పూర్ ఆస్పత్రులకు తరలించారు. అయితే కొందరు బస్సు కోసం వెయిట్ చేస్తుండగా, కారు – ట్రక్కు వారిపైకి దూసుకెళ్లినట్లు పోలీసులు నిర్ధారించారు. వీరిలో కొందరు చనిపోగా, మరికొందరు గాయపడ్డారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.