బంజారాహిల్స్ : అద్దెకు ఇంట్లోకి దిగుతామంటూ వెబ్సైట్లో రిక్వెస్ట్ పెట్టి క్యూఆర్‌కోడ్ ద్వారా రూ. 75 వేలు మోసం చేశారు సైబర్ నేరగాళ్లు. శ్రీనగర్‌కాలనీ శాలివాహననగర్‌లో నివాసముండే బసిరెడ్డి మహేష్‌కుమార్ రెడ్డి తన ఇంటిని అద్దెకిచ్చేందుకు 99 ఎకర్స్ వెబ్ సైట్లో ప్రకటన ఇచ్చారు. సునీత అనే మహిళ ఈ నెల 10న ఫోన్ చేసి తాము ఫ్లాట్‌ను అద్దెకుతీసుకుంటామని చెప్పింది.
అనంతరం అద్దె కింద 15 వేల రూపాయలు అడ్వాన్స్ చెల్లిస్తామని మిగిలిన 15 వేలు మొత్తాన్ని ఫ్లాట్‌లో దిగేరోజు ఇస్తా మని నమ్మబలికారు. అద్దె క్యూఆర్ కోడ్ ద్వారా పంపిస్తామంటూ చెప్పారు. క్యూఆర్ కోడ్ పంపించగా మహేష్ స్కాన్ చేయగానే ఆయన ఖాతాలో పలు దఫాలుగా రూ 75 వేలు డ్రా అయ్యాయి. మోసపోయినట్టు గ్రహించిన బాధితుడు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.