మన్సూరాబాద్ : కిరాణాషాపులో ఉన్న మహిళ మెడలో నుంచి ఓ గుర్తు తెలియని దుండగుడు తులం బంగారు పుస్తెల ను అపహరించుకుపోయాడు. ఈ ఘటన ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఎల్బీనగర్, హస్తినాపురం, అనుపమానగర్లో స్వప్నారెడ్డి (35) కిరాణాషాపుతో పాటు పిండిగిర్నిని నడుపుతుంది.
సదరు మహిళ షాపులో ఉన్న సమయంలో ముఖానికి మాస్కు ధరించి ఉన్న ఓ గుర్తు తెలియని వ్యక్తి ( సుమారు 35 వయస్సు) వచ్చి చెక్కీలు కావాలని అడిగి డబ్బులు ఇచ్చాడు. చెక్కీలు ఇస్తుండగా ఒక్క ఉదుటున మహిళ మెడలోని పుస్తెల తాడును లాగే ప్రయత్నం చేశాడు.
ఆమె ప్రతిఘటించి బంగారు గొలుసును గట్టిగా పట్టుకోవడంతో సుమారు తులం బంగారు పుస్తెలను అపహరించుకుని పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలం పరిసరాలలో ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌లను పోలీసులు పరిశీలిస్తున్నారు.