బెంగళూర్ : క్యాబ్ డ్రైవర్లు ఓ యువతి (20)ని లైంగిక వేధింపులకు గురిచేయడంతో పాటు రూ 5 లక్షలు డిమాండ్ చేసిన ఘటన కర్నాటకలోని హోస్కోట్లో వెలుగుచూసింది. నిందితులను హందెనహళ్లి, మరసంద్ర గ్రామాలకు చెందిన క్యాబ్ డ్రైవర్లు ఆసిఫ్, నవాజ్ పాషా, లియాకత్ పాషా, సల్మాన్ ఖాన్‌గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఘటన జరిగిన రోజు యువతి తన బంధువుతో కలిసి కూల్ డ్రింక్స్, స్నాక్స్ తీసుకునేందుకు హోస్కోట్ సమీపంలో కొత్తగా అభివృద్ధి చేసిన లేఅవుట్‌కు వెళ్లారు.
ఈ సమయంలో బాధితురాలి కారును నిందితులు చుట్టుముట్టి వారిని బెదిరించారు. వారిద్దరినీ వీడియో తీసిన నిందితులు వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరించారు. రూ 5 లక్షలు చెల్లించాలని వారిని బెదిరించారు. నిందితులు యువతిని కారు నుంచి బయటకు లాగి లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. అదే సమయంలో గొర్రెల కాపరులు అటువైపు రావడంతో నిందితులు పరారయ్యారు. ఘటన అనంతరం యువతి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.