Telangana | ఇది సినిమా స్టోరీని మించిన కథ! భర్తకు పిల్లలు పుట్టరని తెలియడంతో పుట్టింటికి వెళ్లిపోయిన ఓ మహిళపై మరిది కన్నేశాడు. ఆమెకు మాయమాటలు చెప్పి లోబరచుకున్నాడు. పైగా ఈ నీచపు పనికి అత్తామామలు కూడా సపోర్ట్ ఇచ్చారు. దీంతో రెచ్చిపోయిన మరిది.. వదినను ఇద్దరు పిల్లలకు తల్లిని చేశాడు. ఇప్పుడు మరో అమ్మాయితో పెండ్లికి సిద్ధమయ్యాడు. ఈ విషయం తెలిసిన వదిన పోలీసులను ఆశ్రయించడంతో అసలు సంగతి బయటపడింది. వరంగల్ జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని బజ్జుతండా శివారు చిన్నతండాకు చెందిన జాటోత్ రాజుకు ఎల్లాయగూడేనికి చెందిన ఓ మహిళతో 2017లో వివాహమైంది. పెండ్లయిన చాలా రోజుల వరకు పిల్లలు పుట్టకపోవడంతో దంపతులు వెళ్లి వైద్యులను సంప్రదించారు. వారిని పరీక్షించిన వైద్యులు రాజుకు పిల్లలు పుట్టరని తేల్చిచెప్పారు. డాక్టర్లు చెప్పిన మాటతో నిరాశ చెందిన మహిళ.. భర్తతో కాపురం చేయలేనని చెప్పి పుట్టింటికి వెళ్లింది.
కోడలు వదిలేసి వెళ్తే పరువు పోతుందని భావించిన అత్త భద్రమ్మ, మామ నర్సింహ ఆమెను ఇంటికి వెళ్లి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. పిల్లలు పుట్టేందుకు ఆస్పత్రిలో చికిత్స చేయిస్తామని మాట ఇచ్చి కాపురానికి తీసుకొచ్చారు. కానీ ఆ దంపతులను మాత్రం ఆస్పత్రికి తీసుకెళ్లలేదు. పైగా కోడలికి షాకిచ్చారు. నీ భర్త రాజుకి పిల్లలు పుట్టరని వైద్యులు చెప్పారు కదా.. నీ మరిది శ్రీనుతో కలిసి కాపురం చేస్తే పిల్లలు పుడతారని ఉచిత సలహా ఇచ్చారు. అందుకు అంగీకరించాలని ఆమెపై ఒత్తిడి తీసుకొచ్చారు. తల్లిదండ్రులే సపోర్టు ఇవ్వడంతో శ్రీను కూడా వదినపై కన్నేశాడు. చెప్పింది వింటే సంతోషంగా ఉండటమే కాకుండా.. ఆస్తిపాస్తులన్నీ మనమే అనుభవించవచ్చని నమ్మబలికి వదినతో కాపురం చేస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో వీరికి ఓ కుమారుడు, కుమార్తె కూడా జన్మించారు. ఇన్నాళ్లూ గుట్టుచప్పుడుగా సాగిన కాపురంలో ఇటీవల విబేధాలు తలెత్తాయి. అత్తామామ, మరిది ఇద్దరూ మమతతో గొడవ పడ్డారు. తన పుట్టింటికి వెళ్లిపోవాలని ఒత్తిడి తీసుకొచ్చారు. 20 రోజుల క్రితం ఆమెను కొట్టి పుట్టింటికి వెళ్లగొట్టారు.
వదినను ఇంటి నుంచి వెళ్లగొట్టిన తర్వాత శ్రీను వేరే అమ్మాయిని పెండ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. ఇటీవల నిశ్చితార్థం కూడా చేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన బాధితురాలు.. చిన్నతండాకు వచ్చి నిలదీసింది. జరిగిన విషయం పెద్దల ముందు బయట పెట్టింది. అయితే వదినను ఇష్టం వచ్చినట్టు దూషించిన శ్రీను.. వేరే పెండ్లి చేసుకుంటానని తేల్చిచెప్పాడు. దీంతో సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.