ముంబై : ఓ ఏటీఎంను పేల్చేసేందుకు ఏకంగా జిలెటిన్ స్టిక్స్తో పాటు పేలుడు పదార్థాలను ఉపయోగించారు. అనంతరం ఏటీఎంలో దొరికిన రూ. 11 లక్షలను ఎత్తుకెళ్లారు. ఈ ఘటన మహారాష్ట్ర సతారా జిల్లాలోని నాగ్థానే గ్రామంలో వెలుగు చూసింది.
బుధవారం తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో నాగ్థానే గ్రామంలో ఉన్న బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఏటీఎంలోకి దొంగలు ప్రవేశించారు. ముఖాలకు ముసుగులు ధరించిన దొంగలు.. ఏటీఎం సెంటర్లో ఉన్న సీసీటీవీ కెమెరాలపై నల్లటి ఇంకును చల్లారు. ఆ తర్వాత జిలెటిన్ స్టిక్స్, ఇతర పేలుడు పదార్థాల సాయంతో ఏటీఎంను పేల్చేశారు. ఏటీఎం పూర్తిగా ధ్వంసమైంది. దాంట్లో ఉన్న రూ. 11 లక్షల నగదును దొంగలు అపహరించారు. అయితే సీసీటీవీ కెమెరాలపై ఇంకు చల్లడంతో.. ఆ దృశ్యాలు నమోదైనప్పటికీ స్పష్టంగా కనిపించడం లేదు. ఇలాంటి ఘటనే కొద్ది రోజుల క్రితం సతారా జిల్లా కరాడ్ సిటీకి సమీపంలోని విద్యానగర్ ఏరియాలో చోటు చేసుకుంది. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.