న్యూఢిల్లీ : బీజేవైఎం జాతీయ ప్రధాన కార్యదర్శి తజిందర్ బగ్గా అరెస్ట్‌పై రాజకీయ దుమారం రేగుతోంది. బగ్గాను శుక్రవారం 50 మంది పంజాబ్ పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి పంజాబ్‌కు తరలిస్తుండగా, హర్యానాలోని కురుక్షేత్రలో ఢిల్లీ పోలీసులు అడ్డుకొని బగ్గాను తిరిగి ఢిల్లీకి తీసుకువచ్చారు. పంజాబ్ పోలీసులపై ఢిల్లీలో కిడ్నాప్ కేసు నమోదైంది.
తేజీందర్ పాల్ సింగ్ బగ్గా గతంలో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని పంజాబులో కేసు నమోదైంది. ఈ క్రమంలో పంజాబ్‌లో విచారణకు హాజరుకావలని నోటీసులివ్వగా.. బగ్గా విచారణకు హాజరు కాలేదు. దీంతో 50 మందితో కూడిన పంజాబ్ పోలీస్ బృందం శుక్రవారం పశ్చిమ ఢిల్లీలోని జనక్‌పురిలో నివాసం ఉంటున్న బగ్గా ఇంటికి వెళ్లి ఆయనను అదుపులోకి తీసుకుంది.
తేజీందర్ బగ్గా వ్యవహారంపై ఆప్ ఎమ్మెల్యే ఆతిషి సింగ్ కాషాయ పార్టీ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. తేజీందర్ వంటి గూండాను కాపాడేందుకు బీజేపీ రెండు రాష్ట్రాల పోలీసులను దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. మరోవైపు బగ్గాను తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పంజాబ్ అండ్ హర్యానా కోర్టులో పంజాబ్ ప్రభుత్వం హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసింది.