Nizamabad | నిజామాబాద్ : ఆమె అతడిని నమ్మింది. మనసారా ప్రేమించింది. ప్రియుడు ఓ మోసగాడు అని గ్రహించలేకపోయింది. పెళ్లి ప్రస్తావన తెచ్చేసరికి ముఖం చాటేస్తున్నాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన నిజామాబాద్ జిల్లాలోని నవీపేటలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. నవీపేటకు చెందిన హరిణి(25) అనే యువతిని ప్రేమిస్తున్నట్లు ఓ యువకుడు నమ్మించాడు. అతని మాటలను నమ్మిన ఆమె మనసారా ప్రేమించింది. అతన్నే పెళ్లి చేసుకోవాలని కూడా నిశ్చయించుకుంది. పెళ్లి ఎప్పుడు చేసుకుందాం అని అడగ్గా ముఖం చాటేశాడు. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన యువతి.. తన ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.