Shabad | షాబాద్, మార్చి 13: గుర్తు తెలియని వ్యక్తులు వైన్ షాపులో చోరికి పాల్పడి, అందులో పడుకున్న వ్యక్తి అడ్డురావడంతో హత్య చేసిన సంఘటన షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల కేంద్రంలోని దుర్గా వైన్స్‌లో బుధవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు దుకాణం వెనకాల నుంచి రంధ్రం చేసి వైన్స్‌లోకి ప్రవేశించారు.
పక్కనే పర్మిట్ రూమ్‌లో పడుకున్న భిక్షపతి అప్పుడే మేల్కొన్నాడు. దొంగతనానికి పాల్పడుతున్నారని తెలిసి వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా, అతనిపై దాడి చేసి హత్య చేశారు. అనంతరం వైన్స్‌లో నగదుతో పాటు మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లారు. ఆధారాలు దొరక్కుండా సీసీ కెమెరాలు ఎత్తుకెళ్లారు. గురువారం ఉదయం దుకాణం నిర్వాహకులు వైన్ షాప్ తెరిచి చూసేసరికి వ్యక్తి శవం కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలాన్ని చేవెళ్ల ఏసిపి కిషన్, షాబాద్ సీఐ కాంతారెడ్డి సందర్శించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ దవాఖాన కు తరలించారు. క్లూస్ టీమ్ ను పిలిపించి ఆధారాలు సేకరిస్తున్నారు.