Sangareddy | జహీరాబాద్ : అన్నదమ్ముల మధ్య నెలకొన్న భూవివాదం( Land Disputes )లో ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. అన్నను తమ్ముడితో పాటు ఆయన కుటుంబ సభ్యులు వేటకొడవలితో అతి కిరాతకంగా నరికి చంపారు. మొండెం నుంచి తల వేరు చేశారు. ఈ దారుణ ఘటన సంగారెడ్డి జిల్లా( Sangareddy Dist ) ఝరాసంఘం పరిధిలోని బర్దిపూర్లో చోటు చేసుకుంది.
పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. ఝరాసంఘం మండలంలోని బర్దిపూర్ గ్రామానికి చెందిన చంద్రప్ప(55), రత్నం అనే ఇద్దరు వ్యక్తులు అన్నదమ్ములు. వీరు గతంలో పెద్దల భూములను పంచుకోవడం జరిగింది. అయితే చంద్రప్పకు రోడ్డు సమీపంలో 12 ఎకరాల భూమి ఉంది. అందులో వాటా కావాలని రత్నం గొడవకు దిగేవారని తెలిపారు.
ఈ భూ వివాదం గత కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య జరుగుతుందని తేలింది. ఈరోజు మధ్యాహ్నం రత్నం కుటుంబ సభ్యులు చంద్రప్పను హత్య చేశారు. అనంతరం మొండెం నుంచి తలను వేరు చేశారు. తలను మరోచోట పడేసి పరారీ అయ్యారు. బర్దిపూర్ గ్రామంలో చంద్రప్పనే రైతు దారుణ హత్యకు గురయ్యారని సమాచారం తెలుసుకుని జహీరాబాద్ రూరల్ సీఐ వెంకటేష్ సంఘటనా స్థలానికి చేరుకొని హత్య వివరాలు సేకరించారు. ఝరా సంఘం ఎస్సై రాజేందర్ రెడ్డి కూడా ఘటనాస్థలికి వెళ్లి ఆధారాలు సేకరించారు.