Rangareddy | రంగారెడ్డి : షాపూర్‌నగర్‌లోని ఆదర్శ్ బ్యాంకులో ఓ గంట పాటు టెన్షన్ నెలకొంది. శివాజీ అనే వ్యక్తి బ్యాంకులోకి ప్రవేశించి హల్చల్ సృష్టించాడు. బ్యాంక్ సిబ్బందిని బాంబుతో బెదిరించి డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. తక్షణమే రూ. 2 లక్షలు ఇవ్వకపోతే బాంబు పేల్చేస్తానంటూ షర్ట్ బటన్స్ తీసేసి అందర్నీ భయభ్రాంతులకు గురి చేశాడు. సూసైడ్ బాంబు మాదిరిగా ఉండటంతో అప్రమత్తమైన బ్యాంకు సిబ్బంది పోలీసులకు సమాచారం అందించింది.
ఇక క్షణాల్లోనే పోలీసులు ఆదర్శ బ్యాంకు వద్ద వాలిపోయారు. శివాజీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతన్ని పరిశీలించగా, బాంబు లాంటి పరికరాలు లేవని పోలీసులు తేల్చారు. ఉత్తుత్తి బాంబు అని నిర్ధారించారు. చెరుకు గడలకి రెడ్ టేప్ వేసి బాంబు అని బెదిరించినట్లు పోలీసుల విచారణలో తేలింది. యూట్యూబ్‌లో చూసి డబ్బుల కోసమే ఈ రకంగా భయపెట్టించినట్లు శివాజీ పోలీసుల విచారణలో అంగీకరించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.