బాలిక గర్భం దాల్చడంతో విషయం వెలుగులోకి..
తల్లి ఫిర్యాదుమేరకు కేసు నమోదు
పోలీసుల అదుపులో నిందితుడు..
దుండిగల్, మార్చి 14 : వివాహితతో సహజీవనం చేస్తూ.. ఆమె కూతురుపై కన్నేశాడు ఓ ప్రబుద్ధుడు. కొత్తబట్టలు, చాక్లెట్లు కొనిస్తానని ఆశచూపి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. బాలిక గర్భం దాల్చడంతో అబార్షన్ చేయించాడు. అస్వస్థతకు గురికావడంతో దవాఖానకు తీసుకెళ్లగా అసలు విషయం బయటపడింది.
దుండిగల్ సీఐ రమణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా అమ్రాబాద్ మండలం ఓ గిరిజన గ్రామానికి చెందిన మహిళకు 14 ఏండ్ల కొడుకు, 13 ఏండ్ల కూతురు ఉన్నారు. పదేండ్ల కిందట భర్త చనిపోవడంతో అదే గ్రామానికి చెందిన రాకేశ్ అలియాస్ రాఖీ(27)తో సహజీవనం చేస్తూ నగర శివారు దుండిగల్ మున్సిపాలిటీ పరిధి, మల్లంపేటలోని మసీదు ప్రాంతంలో నివాసముంటున్నారు. రాకేశ్ ఇటుకల బట్టీలో డీసీఎం డ్రైవర్‌గా పనిచేస్తుండగా సదరు మహిళ ఇండ్లలో పాచిపనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. మహిళ కొడుకు స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతుండగా బాలిక ఆరవ తరగతి చదువుతున్నది.
ప్రతి రోజు తెల్లవారుజామునే పిల్లలను ఇంట్లోవదిలి పాచిపనులకు వెళ్లే తల్లీ ఆదివారం మాత్రం తన కొడుకును వెంట పెట్టుకొని పనికి వెళ్లేది. దీన్ని అదునుగా భావించిన రాకేశ్ ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికకు కొత్త బట్టలు, చాక్లెట్లు కొనిస్తానని ఆశచూపి ఆరునెలలుగా ప్రతి ఆదివారం లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక గర్భం దాల్చడంతో 20 రోజుల కిందట నిజాంపేట్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానలో అబార్షన్ చేయించాడు. అయితే అబార్షన్ అనంతరం బాలిక అస్వస్థతకు గురికావడంతో చికిత్స నిమిత్తం ఆమె తల్లి ఐడీఏ బొల్లారంలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తీసుకెళ్లగా అసలు విషయం బయటపడింది. దీంతో ఆదివారం రాత్రి దుండిగల్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సోమవారం నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కేసు దర్యాప్తులో ఉంది.