ఎదులాపురం : సైబర్ నేరగాళ్లు సామాన్యులను బురిడీ కొట్టించి సొమ్ములతో ఉడాయించడం గురించి మనం చాలాసార్లు విన్నాం. అలాంటి నేరగాళ్లను ఓ సామాన్యుడు బురిడీ కొట్టించి ముప్పుతిప్పలు పెట్టిన ఘటన ఇది. కాబోయే బాధితుడు సైబర్ నేరస్థుడిని ముందుగానే పసిగట్టడం ఇందులో కీలకం. దాంతో డబ్బులు పోలేదు సరికదా వచ్చిపడ్డాయి. పోలీసుల సూచనల ప్రకారం నడుచుకుంటూ తన ఖాతాలో పడిన నగదు తీసుకొని ఆపై సైబర్ నేరగాడినే ఇరకాటంలో పెట్టేసిన ఘటన ఇది.
ఈ నమ్మలేని నిజాలు తరహా ఘటన వివరాల్లోకి వెళ్తే.. పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్‌కు చెందిన చంద్రమౌళి ఆదిలాబాద్‌లో నివాసం ఉంటున్నాడు. అతనికి స్వగ్రామంలో కొంత సాగుభూమి ఉన్నది. పీఎం సమ్మాన్ నిధి నుంచి రావాల్సిన రూ. 2 వేలు ఎందుకు పడలేదో తెలుసుకొనేందుకు గూగుల్‌లో టోల్‌ఫ్రీ నంబర్ కోసం వెతికాడు. గతనెల 20న 1800-150-1551కు ఫోన్ చేశాడు. వారడిగిన పట్టాదారు పాస్‌పుస్తకం, బ్యాంకు ఖాతా, ఆధార్ వివరాలు చెప్పాడు. వారు ఏటీఎం కార్డు నంబరు అడగడంతో అదీ చెప్పేశాడు. ఓటీపీ కూడా అడగడంతో అనుమానించిన చంద్రమౌళి ఫోన్ కట్ చేశాడు. పీఎం సమ్మాన్నిధి టోల్‌ఫ్రీ నంబర్‌ను హ్యాక్ చేశారని భావించాడు. వెంటనే అతడికి మరో నంబర్ (6201772535) నుంచి ఫోన్ వచ్చింది.
బ్యాంకు ఖాతాలో జీరో బ్యాలెన్స్ ఉందని, కనీసం రూ. 500 జమ చేయాలని చెప్పడంతో చంద్రమౌళి రూ.1,000 ఖాతాలో వేశాడు. వెంటనే ఆ ఖాతాలో రూ.10 వేలు జమ అయినట్టు ఫోన్‌కు మెసేజ్ వచ్చింది. వెంటనే చంద్రమౌళి ఏటీఎంకు వెళ్లి రూ.4,000 (తనకు కిసాన్ సమ్మాన్ నిధినుంచే వచ్చే డబ్బులుగా భావించి) డ్రా చేసుకున్నాడు. అదేరోజు రాత్రి 9 గంటల ప్రాంతంలో సైబర్ నేరస్తుడు మళ్లీ ఫోన్ చేసి ఓటీపీ నంబర్ అడుగగా చెప్పేశాడు. వెంటనే రూ.6 వేలు ఖాతానుంచి డెబిట్ అయినట్టు మెసేజ్ వచ్చింది. మరుసటి రోజు ఉదయం 12 గంటల్లోపు విడుతలవారీగా మొత్తం రూ.78 వేలు ఖాతాలో జమ అయ్యా యి. ఓటీపీ చెప్పకుండానే ఈ మొత్తం డ్రా అయిపోయాయి. తిరిగి మరుసటిరోజు రూ.74 వేలు జమ అయినట్లు మెసేజ్ వచ్చింది. దీంతో వెంటనే సైబర్‌క్రైం టోల్‌ఫ్రీ నంబర్ 155260కు గతనెల 26న ఫోన్ చేసి విషయమంతా వివరించాడు. వారి సూచన మేరకు చంద్రమౌళి వెంటనే బ్యాంకుకు వెళ్లి తన ఖాతాను బ్యాంకు మేనేజర్‌కు చెప్పి హోల్డ్‌లో పెట్టించాడు. ఈ లోపే ఖాతా నుంచి రూ.16 వేలు డ్రా అయినట్టు చంద్రమౌళికి మెసేజ్ వచ్చింది.
ప్రస్తుతం అతడి ఖాతాలో రూ.58 వేలు (సైబర్ నేరగాళ్ల డబ్బు) నిల్వ ఉన్నాయి. ఆ డబ్బుల కోసం ఓటీపీలు వస్తూనే ఉన్నాయి. ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఆ డబ్బులు ఖాతాలోనే ఉండిపోయాయి. వారం రోజులుగా చంద్రమౌళి బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ, విత్‌డ్రా కూడా అవుతుండటంతో ఈ డబ్బులు ఎవరివనేది ప్రశ్నార్థకంగా మారింది. సైబర్ నేరగాళ్లు మరో ఖాతా నుంచి దోచి ఆ మొత్తం చంద్రమౌళి ఖాతాలో వేసి తర్వాత తీసుకోవచ్చనుకున్నారా? లేక నేరం అతనిపైకి మోపే ప్రయత్నం చేశారా? అనేది అంతు చిక్కడం లేదు.